Thursday, 1 March 2012

కటిక రాతిపై చేద బావి

ఎవరైనా నీళ్ళ కోసం తమ ఇంటి పరిసరాల్లో బావి తవ్వుకుంటారు. బావి తవ్వినపుడు అనుకోకుండా అందులో బండ పడితే, వారి ఇబ్బందులు చెప్పరానివి. చాల మంది అయితే ఆ ప్రయత్నాన్నే ఉపసంహరించుకుంటారు. కాని పూర్వ కాలంలో ఏకంగా రాతినే తొలిచి బావిని తయారు చేసిన చిత్రమైన సంఘటన ఇది. పాప పరిహారార్ధం కటిక రాతి బండని తవ్వి, బావిని తయారు చేసిన చరిత ఈ ప్రాంతంలో ఉంది. చెన్నూర్, కోటపల్లి రహదారిలోని బక్కలవాగు వద్ద రాతి బండతో తవ్విన అద్భుతమైన బావి ఉంది. ఇందులో ఎప్పుడూ పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఈ వేసవిలో సైతం నీళ్ళున్నాయి. గత కొన్నేళ్లుగా బావిలోని నీళ్ళని వినియోగించడం లేదు. ఈ రాతి బావికి ఓ చరిత్ర ఉంది. పూర్వం చెన్నూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పొరపాటున పిల్లిని చంపాడు. పాప పరిహారం కోసం ఓ బ్రాహ్మణుడి వద్దకి వెళ్లి సంఘటనని వివరించాడు. కటిక రాతి బండపై బావి తవ్వి అందులో నీళ్ళు పడిన తర్వాత బంగారు పిల్లిని తయారు చేసి అందులో వేయాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి చెన్నూర్-కోటపల్లి రహదారిలో ఉన్న రాతి బండపై బావిని తవ్వించగా పుష్కలమైన నీళ్ళు పడ్డాయి. ఆ తర్వాత బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే చేసి పాప పరిహారం చేసుకున్నాడు. గతంలో బావి పక్కనుంచే కోతపల్లికి రహదారి ఉండేది.రాను రాను వాగు నుంచి రహదారి ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు నేరుగా వెళ్లి చూస్తే గాని ఈ బావి కనపడదు. పూర్వం బాటసారులు ఈ బావి నీళ్ళు తాగి దప్పిక తీర్చుకునేవారని పూర్వీకులు చెబుతారు. ప్రస్తుతం ఈ బావి పక్షులకి నిలయంగా మారింది. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers