Sunday, 11 March 2012

గాంధారి ఖిల్లా

మందమర్రి మండలంలోని తిమ్మాపూర్ పంచాయితీలోని బొక్కలగుట్ట (మంచిర్యాల-మందమర్రి మార్గంలో) గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో" గాంధారి ఖిల్లా "ఉంది. గ్రామం నుండి అడవిలోకి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తే ఈ ప్రాంతం వస్తుంది..గోండు రాజులు దీనిని రాజధానిగా చేసుకొని పాలించారు.
గాంధారి  ఖిల్లా ఒడ్డె రాజుల కళా నైపుణ్యానికి నిలయంగా ఉంది. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు ,శిల్ప సంపద,  విగ్రహాలు,ఆలయాలు  ఉన్నాయి. ఎత్హయిన గుట్టపై ఉన్న కోటకి చేరేందుకు నిర్మించిన మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.కొండపై బండరాయితో తొలిచిన మూడు ప్రధాన ద్వారాలు కాకతీయుల కళా తోరణాన్ని మరిపిస్తున్నాయి. భోగం గుళ్ళు , గాంధారీ మైసమ్మ, కాల భైరవుడు,శివుడు,విఘ్నేశ్వరుడు , ఆంజనేయుడు, ప్రతిమలున్నాయి. కొండ మీద నిర్మించిన కోటపై శత్రువులని పసిగట్టేందుకు, " నగారా గుండు "(రక్షణ దుర్గం ) అబ్బుర పరుస్తుంది. కొండపైకి వెళ్లేందుకు గుర్రాలు,ఏనుగుల కోసం నిర్మించిన మార్గం పర్యాటకులని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 


గాంధారి ఖిల్లాపై కొండ పై భాగంలో బండని తొలిచి నిర్మించిన నాగశేషుని ఆలయం ఉంది. దీంట్లో సుమారు 8 అడుగుల ఎత్తుతో 12 పడగల నాగశేషుని ఏకశిలా విగ్రహం ఉంది.దీనికి ఎదురుగా ఒడ్డె రాజుల శిలా శాసనం కనిపిస్తుంది. ఆలయం పక్కన 3 బావులున్నాయి. వీటిని "సవతుల బావులు"గా ఈ ప్రాంత ప్రజలు వ్యవహరిస్తారు.వేసవి కాలంలో సైతం ఇందులో నీరు ఎండిపోదు.
        
 గాంధారి మైసమ్మ ని గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆది, గురు వారాల్లో, జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలకి చెందిన గోండులు, మన్నెలు, కోయలు, నాయక్ పోడు జాతుల వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. వర్షాలు కురవాలని పంటలు వేసే ముందు ప్రతి ఏటా గిరిజనులు భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


రెండు సంవత్సరాలకి ఒకసారి కార్తీక మాసంలో ఇక్కడ జాతర జరుపుతారు.పూజల్లో భాగంగా గిరిజనులు రాత్రంతా ఇక్కడే ఉంది జంతు బలులు ఇస్తూ చాటలో గాటక పోసి " సరువు సాటవడి " పేరిట గ్రామాల చుట్టూ తిరుగుతారని బొక్కల గుట్ట గ్రామస్తుల ఉవాచ. 
 ఇక అన్ని చారిత్రక ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ప్రభుత్వం ఈ కోట పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం తో ఇక్కడి శిల్ప సంపద శిథిలమవుతోంది.
దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers