Tuesday, 13 March 2012

అభినవ పోతన- వానమామలై వరదాచార్యులు

                 పోతన లాగా మధురంగా పద్యం చెప్పడమే కాకుండా పోతన చరిత్రము అనే బృహత్ కావ్య రచన చేసిన వానమామలై వరదాచార్యులు అభినవ పోతన బిరుదాంకితులు..
                      బక్కయ్య శాస్త్రి- సీతాంబ దంపతులకు ఆగస్ట్ 16 , 1912  లో వరంగల్ జిల్లాలోని మడికొండ లో జన్మించారు..బాల్యంలో ఆయనకి బడి చదువు అబ్బలేదు.. ఆయన సహజ కవి..  డిగ్రీలు లేని పండితుడైనందున పూర్వ హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య మంత్రి బూర్గుల రామకృష్ణ రావు ఒక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా నిజామాబాదు జిల్లాలోని దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియామకం చేసారు..ఆ తరవాత ఆయన ఆంద్ర సారస్వత పరిషత్తు వారి విశారద వ్రాసి ఉత్తీర్ణులయ్యారు.. చిత్రమైన విషయం ఏమంటే -వరదాచార్యుల వారు రచించిన మణిమాల  ఈ విశారద పరీక్షలో పాట్యాంశం గా ఉంది..అది చదివి పరీక్ష రాయవలసి వచ్చింది.. ఆ దోమకొండ జనతా కళాశాలలో పని చేస్తున్న కాలం లో బాలల కోసం అనేక బుర్ర కథలు, నాటికలు, నాటకాలు రచించారు..
" మన జవాన్ ల రక్త బలం
   మన కిసాన్ ల పంట పొలం
మన విద్యా గంగా జలం
             ధ్వజమెత్తే త్రివర్ణములన్ "  అంటూ 
                                  అనేక దేశ భక్త పూరిత గేయాలను కూడా రచించాడు..

             పోతన కవిలాగే రైతు కుటుంబానికి చెందిన వరదాచార్యులు తన 13 వ యేటనే పద్య రచన ప్రారంభించారు.. 1945  నాటికి మణిమాల ఖండ కావ్యం ప్రచురించారు. విశారద పూర్తయ్యాక దోమకొండ నుండి చెన్నూర్ ఉన్నత పాటశాలకి బదిలీ చేయించుకొని వెళ్లి 1961 నుండి 1972 లో ఉద్యోగ విరమణ చేసే దాకా అక్కడే ఉన్నారు.. పద్దెనిమిదేళ్ళ అధ్యాపక వృత్తి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహా రావు 1972 లో వీరిని శాసన మండలికి నామినేట్ చేయగా ,1978 దాకా కొనసాగారు..కొంతకాలం చెన్నూరు లో వేద పాటశాల స్థాపించి అధ్యక్షులుగా ఉన్నారు..
                నవీన పంచ కావ్యాలలో ఒకటైన పోతన చరిత్రము ద్వాదశ ఆస్వాసాలతో 4000 పద్యాలు గల ,1100 లకు పైగా పేజీలున్న మహా కావ్యం.. మణిమాల తర్వాత దీని రచన ప్రారంభించినా వరదాచార్యుల అనారోగ్య కారణంగా , ఆర్ధిక ఇబ్బందుల మూలంగా దాన్ని ప్రచురించడంలో ఎంతో జాప్యం జరిగింది.. చివరికి ఈ కావ్యం 1966 లో ముద్రించి 1967 లో ఆవిష్కరించారు..ఆవిష్కరణ సభలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ " నిన్నేమని వినతిన్తును అన్నా! వరదన్నా.! నీ మనసు వెన్న, తనువు వెన్న , మాట తీరు వెన్న " అన్నారు.
           ఈ గ్రంథంలో మొదటి పది ఆశ్వాసాలు పోతన చరిత్రము, చివరి రెండు ఆశ్వాసాలు కావ్యానుబందంగా కూర్చి, అందులో రామ చరిత్రము, నరసింహావతార కథ, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము మొదలగు ప్రసిద్ధ భాగవత కథలు రమణీయంగా రచించారు..ఇందులోని భోగినీ నృత్య ఘట్టం ఆంద్ర సాహిత్యంలోనే అపురూపమైనది..ఈ కావ్యానికి 1968 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది..
             ఈ గ్రంథ రచనా కాలంలోనే వరదాచార్యులు క్షయ వ్యాధి పీడితులై మైసూర్ లో మూడేళ్ళు (1949-1953) ఉండి, చికిత్స పొందవలసి వచ్చింది..వీరి ఊపిరితిత్తులకి 10 సార్లు శస్త్ర చికిత్సలు చేసారు.. ఒక ఊపిరితిత్తి పూర్తిగా చెడి ,కత్తి కోతలకి గురైంది.. ఒకే ఊపిరితిత్తితోనే కడదాకా జీవించారు..
          పోతన  చరిత్రము , మణిమాల కావ్యాలే గాక, భోగినీ లాస్యం, కూలిపోయే కొమ్మ, సూక్తి వైజయంతి, అభినవ కాళిదాసు , స్తవరాజ పంచశతి ,ఆహ్వానం, జయధ్వజం , గీతారామాయణం , వైశాలి, విప్రలబ్ద వంటి సుమారు 50 కృతులు రచించారు.. "మానవులంతా మనవాళ్ళే " అనే నవల రాసారు..గజానన్ దిగంబర్ మాద్గూళ్ కర్ గీత రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించారు.అసంఖ్యాకంగా కావ్య గాన సభల్లో పాల్గొన్నారు..ఆబాల గోపాలాన్ని అలరించి, ఘన సన్మానాలు పొందారు.. 1971  లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వమిచ్చి గౌరవించింది..1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో గండపెండేరం ,స్వర్ణ కంకణం ,రాత్నాభిషేకం చేసి, పి.వి.నరసింహారావు ,దివాకర్ల వెంకటావధాని ,సి.నారాయణ రెడ్డి, బి.రామరాజు లాంటి మహానుభావుల సమక్షంలో భారతీ సాహిత్య సమితి నిధి సమర్పించింది..1976లో కాశీ విశ్వ విద్యాలయం D.Lit వాచస్పతి గౌరవ పట్టా ప్రధానం చేసింది..
అలాగే వివిధ సాహితీ సంస్థలు అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి లాంటి అనేక బిరుదులతో ఘనంగా సన్మానాలు చేశాయి. ఇక వరదాచార్యులకి స్వయానా తన కూతురు వైదేహి ని ఇచ్చి పెళ్లి చేసిన మామగారు శ్రీమాన్ కోదుమనగల్ల జగన్నాథాచార్యులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఆ కాలమున పేరుగాంచిన హరికథకులుగా ప్రఖ్యాతి గాంచారు. 


రామదాసు చరిత్రము, రామానుజ చరిత్రము పద్య కావ్యాలు వ్రాయాలని సంకల్పించిన వరదాచార్యుల వారు 1984 అక్టోబర్  31న ఆకస్మికంగా కన్ను మూశారు..

ఇంత గొప్ప కవిని గురించి ఆసిఫాబాద్ కి చెందిన డి.లలితా సురేష్ కుమార్ గారు " అభినవ పోతన- మన వానమామలై " అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తీసినందుకు గాను, ఆయనకి 2010 సంవత్సర ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్ ని బహూకరించింది..
ఈ డాక్యుమెంటరీ ని దూరదర్శన్ సప్తగిరి చానల్ వారు...2 సార్లు ప్రసారం చేసారు.. దీన్ని మీరు Youtube లో క్రింది  లింక్ లో చూడవచ్చు..
http://www.youtube.com/watch?v=hsHbWnxT0b8


ఇక జనవరి,2012లో వానమామలై శత జయంతి ఉత్సవాల సందర్భంగా చెన్నూర్ లోని జగన్నాధ ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలం లో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.. 
ఈ సందర్భంగా రామ్మోహన్ అనే సాహితీ వేత్త రచించిన అక్షరాంజలి-వానమామలై సూక్తులు , రామోజీ లక్ష్మీపతి పాడిన గేయాల సీడీ ని ఆవిష్కరించారు..

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers