Friday, 17 August 2012

చదువు‘కొనే’0దుకు మార్గం ఎడ్యుకేషన్ లోన్స్...

చదువుకునే రోజులు పోయాయి. చదువుకు‘కొనా’ల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన ప్రొఫెషనల్ కోర్సులను చూసి బెంబేలెత్తుతున్న విద్యార్థులు.. అర్హతలున్నా, ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటివైపే చూడలేకపోతున్నారు. మరోవైపు మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుతం నిబంధనలు పేరిట అనేక పరిమితులు విధిస్తున్న తరుణంలో.. ఉన్నత విద్య ఔత్సాహికులకు ఇప్పటివరకు ఉన్న ఏకైక ఆశ, అవకాశం కూడా చేజారే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించే అంశం బ్యాంకు రుణాలు. ఉన్నతవిద్యను ప్రోత్సహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు, వడ్డీ రాయితీలు వంటి వాటివల్ల ప్రస్తుతం అనేక జాతీయ బ్యాంకులు విద్యార్థులకు దేశంలో ఉన్నత చదువులు చదివేందుకు, విదేశీ విద్య చదివే విద్యార్థులకు సులభ నిబంధనలతో విద్యా రుణాలను మంజూరు చేస్తున్నాయి. వివరాలు..


ఓవైపు ఏకీకృత ఫీజు విధానం.. మరోవైపు కేవలం నిర్దేశిత మొత్తానికి మాత్రమే రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని.. మిగతా మొత్తాన్ని విద్యార్థులు బ్యాంక్ లోన్ రూపంలో భరించాలనే ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో విద్యార్థుల ఉన్నత విద్యాభిలాషకు ఉన్న ఒకే ఒక అవకాశం విద్యా రుణాలు. 

ఏఏ కోర్సులకు:
ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియెట్ అర్హతతో చదివే బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్, బీకాం, బీఏ, తదితర) కోర్సులకు, ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులు, వృత్తి విద్యా కోర్సులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. అయితే ఈ కోర్సులను ఏఐసీటీఈ, యూజీసీ, ఎంసీఐ, హెచ్‌ఆర్‌డీ, యూనివర్సిటీ గుర్తింపు ఉన్న కళాశాలల్లో ప్రవేశం లభించిన విద్యార్థులకు మాత్రమే అందిస్తాయి. అంతేకాకుండా మెరిట్ ఆధారంగా కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే రుణాలు లభిస్తాయి. మేనేజ్‌మెంట్ కోటాలో, క్యాపిటేషన్ ఫీజులు చెల్లించి ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఇవి లభించవు. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు పదో తరగతి నుంచి ఇప్పటివరకు చదివిన కోర్సుల్లో నిర్దేశిత పర్సంటేజీ ఉంటేనే అర్హులని పేర్కొంటున్నాయి. 

ఎంత మొత్తం:
ఏ కోర్సులైనా గరిష్టంగా రూ. పది లక్షల వరకు రుణం లభిస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో (ఐఐటీ, ఐఐఎం తదితర) ప్రవేశం లభించిన విద్యార్థులకు ఆ మొత్తం పదిహేను లక్షల వరకు ఉండే అవకాశాలున్నాయి. గతంలో తక్కువ మొత్తంలో ఉండే రుణాల మొత్తం పెరగడానికి కారణం ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉన్నత విద్య ఔత్సాహికులను ప్రోత్సహించాలని నిర్ణయించడమే. దీంతో నిబంధనలను కూడా ఆయా బ్యాంకులు సులభతరం చేశాయి. గత అయిదారేళ్ల కాలంలో విద్యా రుణాల మంజూరు సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 

విదేశీ విద్యకు కూడా:
ఇటీవల కాలంలో స్టడీ అబ్రాడ్ దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పీజీ స్థాయి కోర్సులు (ఎంఎస్, ఎంబీఏ వంటి) చదివే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారికి కూడా మన బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇలా విదేశీ విద్యకు రుణం ఆశించే విద్యార్థులు కూడా ఏ దేశంలో చదవాలనుకుంటున్నారో.. ఆ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే ప్రవేశం పొందాల్సి ఉంటుంది. 

ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా:
ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకు మాత్రమే రుణాలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మరి ప్రఖ్యాత ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈ విషయంలోనూ కొన్ని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల కోణంలో ఆలోచించాయి. తమ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు భారం తప్పించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రైవేటు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి రుణాలు అందుతాయి. 

రుణ మంజూరులో పరిగణించే అంశాలు:
విద్యార్థికి రుణం మంజూరు చేసే విషయంలో బ్యాంకులు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. అవి.. 
ట్యూషన్ ఫీజు
ఎగ్జామినేషన్/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు
బుక్స్, యూనిఫాం, ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుగోలుకయ్యే వ్యయం 
కంప్యూటర్ కొనుగోలు ఖర్చు 
కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన ఇతర ఖర్చులు (ప్రాజెక్ట్ వర్క్, స్టడీ టూర్స్)
బ్యాంకు నిర్ణయించిన రుణ మొత్తాన్ని విడతలవారీగా నేరుగా కాలేజీలకే అందిస్తాయి. అయితే ప్రథమ సంవత్సరం ప్రవేశం సమయంలో విద్యార్థులు తాము అప్పటికే చెల్లించిన మొత్తానికి సంబంధించి ఆధారాలు చూపిస్తే ఆ మొత్తాన్ని మాత్రం విద్యార్థి పేరు మీద మంజూరు చేస్తాయి. ఆ తర్వాత నుంచి కోర్సు పూర్తయ్యే వరకు కాలేజీకి నేరుగా అందిస్తాయి. 

నిబంధనలు సరళం: ఇటీవల కాలంలో బ్యాంకులు విద్యారుణాల మంజూరు విషయంలో నిబంధనలను సులభతరం చేశాయి. ముఖ్యంగా ‘బ్యాంకు రుణం’ అంటేనే ష్యూరిటీలు అనే ఆందోళనకు తెరదించుతున్నాయి. ఈ క్రమంలో.. స్వదేశంలో చదివే విద్యార్థులకు నాలుగు లక్షల వరకు రుణాలకు తల్లిదండ్రుల హామీ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఇతర ష్యూరిటీలు చూపించక్కర్లేదు. రూ. నాలుగు లక్షల నుంచి ఏడున్నరల లక్షల లోపైతే.. తల్లిదండ్రుల హామీ, కొల్లేటరల్ సెక్యూరిటీ, థర్డ్‌పార్టీ గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. రూ. ఏడున్నర లక్షలు దాటితే తల్లిదండ్రుల హామీ, రుణమొత్తానికి సరిపడే ఆస్తుల హామీ చూపించాలి. దీంతోపాటు భవిష్యత్తులో విద్యార్థి సదరు రుణాన్ని తిరిగి చెల్లించగలడనే విషయానికి ఆధారంగా అతని భవిష్యత్తు ఆర్జనకు సంబంధించిన ఎసైన్‌మెంట్ పత్రం కూడా అందించాలి. ఐబీఏ రూపకల్పన చేసిన విద్యా రుణ పథకం ప్రకారం ఎలాంటి మార్జిన్ మనీ లేకుండానే రుణాలు మంజూరు చేయాలి. కానీ కొన్ని బ్యాంకులు దీన్ని అమలు చేయటంలేదు. కొంత మార్జిన్ మనీ ఉండాలని పేర్కొంటున్నాయి. విదేశీ విద్య విషయంలో మాత్రం ఐబీఏ 15 శాతం మార్జిన్ మనీని నిర్దేశించింది. 

వడ్డీ రేట్లు: ఐబీఏ విద్యా రుణ పథకం ప్రకారం.. ఇతర రుణాలతో పోల్చితే విద్యారుణాల వడ్డీరేట్లు కొంచెం తక్కువగానే ఉంటాయి. అవి ఆయా బ్యాంకుల బేస్‌రేట్ల ఆధారంగా ఉంటాయి. ఈ వడ్డీ విషయంలోనూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షలు మించని విద్యార్థులకు విద్యా రుణాల వడ్డీలపై సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ సదరు కోర్సు పూర్తయిన సంవత్సర కాలం వరకు లేదా ఉద్యోగం పొందాక ఆరు నెలల కాలం వరకు (ఏది ముందు జరిగితే అప్పటివరకు) అమల్లో ఉంటుంది. 

విద్యార్థినులకు ప్రత్యేకం: ఉన్నత విద్య దిశగా మహిళలను ప్రోత్సహించేందుకుగాను విద్యార్థినుల విషయంలో బ్యాంకులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైంది వడ్డీ రాయితీ. ఇది అర శాతం నుంచి ఒక శాతం మధ్యలో ఉంటుంది. అదేవిధంగా అంగవికలురైన విద్యార్థులకు కూడా ఇదే మొత్తాల్లో వడ్డీ రాయితీని అందిస్తున్నాయి. 

పన్నులలోనూ రాయితీలు: విద్యా రుణాలకు చెల్లించే వడ్డీలకు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు కూడా అమల్లో ఉంది. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులకు రుణం తీసుకున్నా లేదా పిల్లలు, భార్య చదువు కోసం, చెల్లెలి చదువుకోసం తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీపై ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తి మినహాయింపులు పొందవచ్చు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడం మొదలు పెట్టినప్పటి నుంచి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల వరకు ఈ మినహాయిం పులు లభిస్తాయి. చెల్లించే అసలుపై మాత్రం ఎటువంటి రాయితీలు లభించవు. 

తిరిగి చెల్లింపు... వడ్డీ: విద్యా రుణం తీసుకున్న విద్యార్థులు ఆ రుణం తీసుకున్న తర్వాత నెల నుంచే తిరిగి చెల్లించక్కర్లేదు. సంబంధిత కోర్సు పూర్తయ్యాక... ఏడాది తర్వాత లేదా ఉద్యోగం వచ్చాక ఆరు నెలల తర్వాత ఏది ముందుగా జరిగితే అప్పటి నుంచి రుణాన్ని వాయిదాల పద్ధతిలో గరిష్టంగా ఐదు నుంచి ఏడేళ్ల వ్య వధిలో తిరిగి చెల్లించవచ్చు. వడ్డీ కూడా అందుబాటు రేటులోనే ఉంటోంది. 

దరఖాస్తుకు సిద్ధమేనా: విద్యా రుణాలను ఆశించే విద్యార్థులు కోర్సు ప్రారంభానికి ముందుగానే ఆ దిశగా తమ కసరత్తు ప్రారంభించాలి. ముఖ్యంగా నిర్దేశిత డాక్యుమెంట్లతో బ్యాంకులను సంప్రదించాలి. ఆ డాక్యుమెంట్ల వివరాలు.. అవి. 

లోన్ అప్లికేషన్:
అప్పటి వరకు పొందిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు
తాజా అడ్మిషన్ కన్ఫర్మేషన్ ప్రూఫ్ 
కోర్సుకయ్యే ఖర్చు మొత్తం అంచనా పత్రం
రెండు పాస్ట్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు
గడచిన రెండేళ్ల కాలానికి తల్లిదండ్రుల ఇన్‌కం ట్యాక్స్ స్టేట్‌మెంట్ 
గత ఆరు నెలల కాలానికి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్స్ స్టేట్‌మెంట్
ఆస్తులు, అప్పులకు సంబంధించి సంక్షిప్త వివరణ
తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ
నివాస ధృవీకరణ.
4 లక్షలవరకు ఎటువంటి డ్యాకుమెంట్స్ అవసరం లేదు.

ఇబ్బందులు ఎదురైతే: రుణ వాయిదాలను తప్పకుండా చెల్లించాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే బ్యాంక్ మేనేజర్‌ను కలవాలి. మీ ఇబ్బందిని వివరిస్తే వాయిదాలు చెల్లింపునకు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల చదువు పూర్తి కాకపోయినా, చెల్లింపు ఆగిపోయినా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. లేకపోతే రుణఖాతాను నిరర్థక ఆస్తి(ఎన్‌పీఏ)గా పరిగణి స్తారు. ఒకసారి ఎన్‌పీఏగా పరిగణిస్తే మళ్లీ ఏ బ్యాంక్‌లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు. అందుకే అటు వంటి సమయంలో బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించటం ఉత్తమం.

విదేశీ విద్య కోసం: విదేశీ విద్యకు రుణం పొందాలనుకునే విద్యార్థులు వీసా మంజూరు కావడానికి అవకాశం ఉన్న తేదీకి నెల రోజుల ముందుగానే ఆ దిశగా కదలాలి. ఈ విద్యార్థులు అందించాల్సిన డాక్యుమెంట్లు..ఆఫర్ లెటర్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, సెక్యూరిటీకి సేల్ డీడ్ కాపీ, లింక్ డాక్యుమెంట్ (ముప్ఫైఏళ్ల కిందట నుంచి), ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్, మున్సిపల్ అప్రూవల్ ప్లాన్, లే అవుట్ అరుుతే దాని ప్లాన్ కూడా తీసుకువెళ్లాలి. వాటితో పాటు రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్, అన్ని అకడెమిక్ సర్టిఫికెట్లు తప్పనిసరి. ఇలా పకడ్బందీగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే లోన్‌కు దరఖాస్తు చేసుకున్న వారం నుంచి పదిరోజుల్లోపే రుణం మంజూరవుతుంది.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers