అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు మహిళా ఉద్యమ పోరాటాల ఫలితమే. స్త్రీని అమ్ముకునే కన్యాశుల్కం, సతీసహగమన నిషేధం, వితంతు పునర్వివాహం, బాల్యవివాహాల నిషేధం మొదలగు చట్టాలు నేడు మనం చూస్తున్నాం. నాటి కన్యాశుల్కం స్థానంలో నేడు వరకట్నం ప్రవేశించింది. నాడు మహిళను అంగట్లో సరుకుగా అమ్ముకున్న పద్ధతి నుండి నేడు వరకట్నం ఇవ్వాల్సిన పరిస్థితి వరకు సమాజంలో ఎటువైపు చూసినా మహిళే బాధితురాలు, బలిపశువు గావించబడుతుంది. మహిళను చైతన్యపరిచే ఈ రోజున ఈ సందర్భంగా స్త్రీకి సంబంధించిన చట్టాలను తెలుసుకుని ముందుకెళ్లడం ఎంతో ముదావహం.
వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి 1961లో వరకట్న నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఈ చట్టంలోని సెక్షన్ 314 ద్వారా వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరమవుతుంది. దీనితో మహిళకు పూర్తి న్యాయం జరుగుతుందా అనేది ఎండమావి లాగానే ఉన్న సమాజంలో వరకట్నం తీసుకుంటున్న ప్రతిఒక్కరూ నేరస్థులే. ఈ చట్టం ఉన్నా దీనిని అమలు పరిచే యంత్రాంగం, అంతేకాదు చట్టాన్ని తీసుకొచ్చిన పాలకులు పాటించిన దాఖలాలు నూటికో కోటికో తప్ప లేవని చెప్పాలి. ఈ చట్టం ఉన్నా వరకట్న వేధింపులు ఆగకపోవడంతోనే మహిళలకు రక్షణగా 1983లో ఇండియన్ పీనల్‌కోడ్-1973కి మార్పులు చేసి అదనంగా 498-ఎ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. వివాహానంతరం స్త్రీని భర్త గానీ, అత్తింటివారు గానీ, ఎవరైనా భర్త సంబంధీకులు శారీరకంగా, మానసికంగా వేధిస్తే వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది.
అనుమానాస్పద మరణం: అలాగే సెక్షన్ 304-బి కూడా వరకట్నానికి సంబంధించినదే. వరకట్నం కోసం స్త్రీ అత్తగారింటి వేధింపులు, కాలిన గాయాలు, శారీరక గాయాలతోగానీ మరణిస్తే... సదరు గాయాలు అస్వభావికమై అలాంటి మరణమునకు ముందు వరకట్నం తీసుకురమ్మని భర్త వల్ల గానీ, బంధువుల వల్ల గానీ వేధించబడినట్లయితే ఈ సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాలు గానీ, యావజ్జీవిత ఖైదు గానీ విధించబడుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు అరికట్టాలనే ఉద్దేశంతో 19-11-1986న అమలులోకి వచ్చింది.
అనుమతి లేకుండా గర్భస్రావం : సెక్షన్ 313 ప్రకారం గర్భవతి అనుమతి లేకుండా గర్భస్రావం జరిపినట్లయితే వారికి 10 సంవత్సరాల వరకు కారాగారశిక్ష, జరిమానా విధించవచ్చు.
మానసిక వేధింపు: స్త్రీని అవమానపరచాలనే భావనతో ఆ స్త్రీకి వినపడేవిధంగా మాట్లాడినా, ఆమె చూసే విధంగా సంజ్ఞలు, సంకేతములు చేసినా, ఆమె ఏకాంతానికి భంగం కలిగినా సెక్షన్ 509 ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.
అవమానం: ఒక స్త్రీని అవమానపరచాలనే సంకల్పంతో ఆమెపై దౌర్జన్యం చేసినా, ఆమెపై బలప్రయోగం జరిపి ఆమెను అవమానపరచినట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఈ సెక్షన్‌ను వయసుతో నిమిత్తం లేకుండా పసిపాప నుండి ముసలి వారందరికీ సెక్షన్ 354 వర్తిస్తుంది. జుట్టు పట్టుకుని లాగడం, చెయ్యిపట్టుకోవడం, వివస్త్రను చేయడం మొదలైనవన్నీ స్త్రీత్వమును, స్త్రీని అవమానపరచటంగానే భావిస్తారు.
అత్యాచారం చేస్తే...: ఎవరైనా ఒక మహిళపై అత్యాచారం చేసినట్టయితే సెక్షన్ 376 ప్రకారం 7 సంవత్సరాల జైలుశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష గానీ, 10 సంవత్సరాల శిక్ష గానీ విధించబడుతుంది. భర్త కూడా స్త్రీ/భార్య అభీష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేసినట్లయితే కూడా ఈ సెక్షన్ అన్వయిస్తుంది. భార్య వయసు 12 సంవత్సరాల పైన ఉన్నట్లయితే 2 సంవత్సరాల శిక్ష మాత్రమే వర్తిస్తుంది.
సెక్షన్ 376-ఎ: ఒక స్త్రీ ప్రత్యేక సందర్భంలోగానీ, కాన్పు ద్వారా గానీ భర్తకు దూరంగా ఉన్న సందర్భంలో ఆమె అనుమతి లేకుండా సంభోగించిన 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 376-బి: ప్రభుత్వోగి ఆధీనంలో ఉన్న స్త్రీని ఆ ఉద్యోగి కానీ, అతని క్రింది ఉద్యోగి కానీ హోదాను అడ్డుపెట్టుకుని సంభోంగించినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా పడుతుంది
సెక్షన్ 376-సి: మహిళా ఖైదీని జైలు అధికారులు సంభోగించినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించబడతాయి.
సెక్షన్ 376-డి: మహిళా ఉద్యోగులను ప్రలోభపెట్టి సంభోగించినట్లయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
నేర విచారణ ప్రక్రియ: క్రిమినల్ (ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 125 ప్రకారం
1.ఎవరైనా ఒక వ్యక్తి తగినంత ఆర్థిక స్థోమత కలిగి ఉండి కూడా సరైన కారణం లేకుండా,
ఎ)భార్యను పోషించకున్నా
బి)మైనర్ పిల్లల్ని పోషించకున్నా (చట్టబద్ధంగా జన్మించిన పిల్లలైనా, అక్రమ సంతానం అయినా)
సి)తల్లిదండ్రులను పోషించకున్నా
ఈ సెక్షన్ ప్రకారం భరణం పొందవచ్చు. గతంలో ఇది ఒక వ్యక్తికి నెలకు 500 రూపాయలు పంపే లాగా ఉండేది. నేడు ఆ వ్యక్తి ఆదాయాన్ని బట్టి ఎంతైనా విధించవచ్చు. విడాకులు ఇచ్చిన భార్యకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం 1985లో షాబాను కేసులో నిర్ణయించింది. ముస్లిం చట్ట ప్రకారం, 'మొహర్' ఇచ్చినా అది సంతృప్తికరంగా లేనట్లయితే ఈ సెక్షన్ ప్రకారం భరణం పొందవచ్చు.
హిందూ వివాహ చట్టం 1955: ఈ చట్టం ప్రవేశం ద్వారా భర్తలు మోసపూరితంగా తమకున్న నపుంసకత్వం గానీ, ఏవైనా జబ్బులు కలిగి ఉన్న వానిని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నట్లయితే విడాకులు పొందే హక్కు వుంది. హిందూ అడాప్షన్ మెయింటెనెన్సు చట్టం ద్వారా కూడా భరణం పొందవచ్చు.
గృహహింస రక్షణ చట్టం 2005: మహిళలపై జరుగుతున్న గృహహింస నుండి స్త్రీని కాపాడడం కోసం చర్చించి చివరగా మన దేశంలో 2005లో ప్రవేశ పెట్టారు. 17-10-2006 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా మహిళలు భర్త గృహంలోనే నివాసమును, ఆర్థికంగా భరణం, గృహహింసకుగానూ నష్టపరిహారం పొందవచ్చు. ఈ చట్టం భర్త అత్తింటి వారిపైననే కాకుండా తండ్రి/ పుట్టింటి ఆరళ్లు నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం స్త్రీని రక్షించడానికే అయినా, ప్రతి వాదులుగా స్త్రీని కూడా చేర్చవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది.
ఎన్ని చట్టాలున్నా అమలులో అలసత్వం పెరిగినట్లయితే నిరుపయోగమవుతుంది. ఈచట్టాలను దుర్వినియోగపరిచినట్లయితే సరియైన బాధితులను కూడా అనుమానించవలసి వస్తుంది. సమాజంలో స్త్రీ తన ప్రత్యేకతను కాపాడుకుంటూ ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటూ సమాజం తలెత్తుకునేలా వ్యవహరిస్తేనే అందుకు ఆ సమాజం సహకరిస్తేనే అది అభివృద్ధికి సంకేతం, లేదంటే నాగరికత వర్ధిల్లనట్టు.
No comments:
Post a Comment